అదొక అజ్ఞాత ఆదివాసీ తెగ! బంగాళాఖాతంలోని, అండమాన్ నికోబార్‌కు చెందిన ‘నార్త్ సెంటినెల్’ దీవి వారి నివాసం! బయటి ప్రపంచంతో సంబంధం లేని ప్రత్యేక ప్రపంచం వారిది! చొరవతో చేరువయ్యే ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా వారి బాణాలకు బలి కావలసిందే! అయినా చేరువై, వారి జీవనశైలిని సన్నిహితంగా అధ్యయనం చేయగలిగింది ఓ మహిళ! ఆమే... బెంగాల్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ మధుమాల చటోపాధ్యాయ!
‘‘మాది హైరా (కోల్‌కతా)లోని షిబ్‌పూర్. ఆదివాసీ తెగల మీద ఆసక్తి నాకు చిన్నప్పుడే ఏర్పడింది. అప్పటికి నాకు 12 ఏళ్లు. ఉదయాన్నే ‘ది టెలిగ్రాఫ్’ దినపత్రికలో అచ్చయిన ఓ చిన్న వార్త నన్ను ఆకర్షించింది. అండమాన్ దీవికి చెందిన అంతరించిపోతున్న తెగ ‘ఓంజె్‌స’లో ఓ బిడ్డ పుట్టిందనేది ఆ వార్త సారాంశం. ఆ పేపర్‌తో నాన్న దగ్గరకు పరిగెత్తుకెళ్లి, వచ్చే సెలవుల్లో ఓంజెస్ తెగ ప్రజలను చూడడానికి వెళ్దామని చెప్పాను. అందుకు నాన్న అండమాన్ దీవుల్లోని తెగలను చూసే అవకాశం కేవలం పరిశోధకులు, విలేకరులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. దాంతో ఆ తెగను కలవడం కోసం పరిశోధకురాలిగా ఎదగాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.
డిగ్రీ కోసం ఆ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నప్పుడు నాన్న నన్ను అడిగిన ప్రశ్న.... ‘ఆంథ్రొపాలజీనే ఎందుకు?’ దానికి నేను ‘ఓంజెస్ తెగను చేరుకోవడానికి ఈ చదువే నా పాస్‌పోర్ట్’ అని చెప్పాను. దాంతో నా మొండి పట్టుదల గురించి తెలిసిన నాన్న ఇష్టం లేకపోయినా నా నిర్ణయానికి అడ్డు చెప్పలేకపోయారు. అలా ఎంతో తెగింపుతో కూడిన ఆదిమ తెగల అధ్యయనం చేసే ఫీల్డ్ ఆంథ్రొపాలజిస్టుగా మారాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అండమాన్ తెగల మీద ఫీల్డ్ రీసెర్చ్‌లో పీహెచ్‌డి చేయడం కోసం, ‘ఆంథ్రొపాలజీ సర్వే ఆఫ్ ఇండియా’కు దరఖాస్తు చేసుకుంటే అక్కడా చుక్కెదురైంది. ఆ తెగల మీద ఫీల్డ్ రీసెర్చ్ చేయడం మహిళా పరిశోధకులకు క్షేమం కాదని, కమిటీ నా దరఖాస్తును తిరస్కరించింది. అయితే చదువులో నేను సాధించిన ప్రగతి, గతంలో చేసిన పరిశోధనలను పరిశీలించిన కమిటీ, చిట్టచివరికి ఫెలోషి్‌పకు అంగీకరించింది. అయితే అందుకు ఓ కండిషన్ పెట్టింది. అంతరించిపోతున్న తెగల మీద జరిపే పరిశోధనలో నేను ప్రాణాలు కోల్పోతే ఆ బాధ్యత ఆంథ్రొపాలజీ సర్వే ఆఫ్ ఇండియాది కాదని అంగీకరిస్తూ నా తల్లితండ్రులు సంతకం పెట్టాలనేది వారి కండిషన్. అలా ఎలాగైతేనేం అనుకున్నది సాధించాను. ఆరేళ్లపాటు అండమాన్ దీవుల్లోని తెగల గురించి అధ్యయనం చేశాను. ఆ క్రమంలో కొన్ని తెగలను కలిశాను. కానీ అన్నిట్లో నార్త్ సెంటినెల్‌లో ఉండే ‘జరావా’ తెగ నన్ను అమితంగా ఆకర్షించింది.
ఉద్వేగభరిత క్షణాలవి!
అది 1991, జనవరి 4. అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ ఓడలో నాతో కలిపి 13 మందితో కూడిన కాంటాక్ట్ టీమ్ నార్త్ సెంటినిల్‌లోని దక్షిణ తీరం చేరుకుంది. అక్కడి నుంచి చిన్న పడవలో దీవి తీరానికి దగ్గరవుతుంటే, జరావా ఆదివాసీ తెగల పూరిళ్లు కనిపించాయి. చెట్ల చాటు నుంచి తెగ ప్రజలు బాణాలు, విల్లంబులతో ప్రత్యక్షమయ్యారు. వాళ్ల దగ్గరకు వెళ్లి, నేరుగా మాటలు కలపడం, చేరువవడం ప్రాణాంతకం. అందుకే పడవలోనే ఉండి, కొబ్బరికాయలను నీళ్లలో జారవిడవడం మొదలుపెట్టాం. కొంతసేపటివరకూ తటపటాయించిన ఆదివాసీలు నీళ్లలో ఈదుకుంటూ వచ్చి తేలుతున్న కొబ్బరికాయలను తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అలా మేం ప్రమాదకర వ్యక్తులం కాదని నమ్మకం కలిగించేటంతవరకూ ఆగాం! అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో తెగలో ఉన్న ఓ యువకుడు మా మీద బాణం ఎక్కుపెట్టి వదిలాడు. సరిగ్గా అదే సమయానికి అతని తల్లి నెట్టడంతో, బాణం దారి తప్పి నీళ్లలోకి దూసుకెళ్లింది.
బహుశా ఆమె మా స్నేహపూరిత ప్రయత్నాలను గ్రహించి ఉండవచ్చు. కొద్దిసేపటి తర్వాత ‘నారియాలి బజా బజా’ అంటూ తెగ ప్రజలు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ‘కొబ్బరి కాయలు ఇంకా కావాలి’ అని వారి మాటలకు అర్థం అని నా వెంట వచ్చిన ట్రాన్స్‌లేటర్ చెప్పాడు. మరిన్ని కొబ్బరికాయలు నీళ్లలో జారవిడిచాం. అలా 4 గంటలు గడిచిన తర్వాత వాళ్లు మరింత దగ్గరగా వచ్చి మా పడవ ఎక్కి కూర్చున్నారు. అలా పడవ ఎక్కిన ఆదివాసీని మేం రక్షణ కోసం తెచ్చుకున్న తుపాకీ ఆకర్షించింది. ఆపత్కాల సమయంలో ఆటవికులను భయపెట్టడం కోసం, గాల్లోకి పేల్చడం కోసం ఆ తుపాకీని తెచ్చుకున్నాం. మహిళలు నావైపు చూస్తూ ‘మిలాలే చెరా’ అంటూ అరిచారు. దానర్థం ‘స్నేహితురాలా దగ్గరకు రా!’ అని. దాంతో నేను పడవ దిగి మోకాల్లోతు నీళ్లలో నడుచుకుంటూ గూడెంలోకి అడుగు పెట్టాను. వాళ్లు నా చర్మం, వెంట్రుకలను ఆసక్తిగా గమనిస్తూ, తడిమి చూశారు. ఒక చేతి కడియం, జుట్టుకు పెట్టుకునే బ్యాండు నాకు బహుమానంగా ఇచ్చారు. వారి తెగలోకి నన్ను అంగీకరిస్తున్నందుకు అది ఒక సంకేతం! ప్రాణాంతక అజ్ఞాత ఆటవిక తెగగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన జరావాలతో నా మొట్టమొదటి కాంటాక్ట్ అదే!
రెండోసారి మరింత సఖ్యంగా!
మొదటి ప్రయత్నంలో దక్కిన ఆదరణ నాకు అంతులేని ధైర్యాన్నిచ్చింది. అలా సరిగ్గా నెలన్నర తర్వాత ఫిబ్రవరి 21న రెండోసారి ఆ దీవిలో అడుగు పెట్టాను. ఈసారి వారి చేతుల్లో మారణాయుధాలు లేవు. పైగా వాళ్లు నన్ను గుర్తుపట్టి, దీవిలోకి ఆహ్వానించారు. వారికి కొబ్బరికాయలు ఇవ్వడంతోపాటు, వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి జీవనశైలిని దగ్గర్నుంచి గమనించాను. వారు కొన్ని పనుల్లో జంతువులను, పక్షులను అనుకరిస్తారు. తల్లులు నోట్లో ఆహారం నమిలి అలాగే పిల్లల నోట్లోకి అందిస్తారు. అలా వాళ్లను దగ్గర్నుంచి గమనించడంతోపాటు, వారితో కలిసి భోజనం కూడా చేశాను. ఇంటి పనుల్లో చేయి కలిపాను. పిల్లలను ఎత్తుకున్నాను. పెద్ద పిల్లలతో కొద్దిసేపు ఆటలాడాను. ఆ క్రమంలో వేటలో భాగంగా ఆటవికుల దేహాలకు తగిలిన గాయాలు నా కంట పడ్డాయి. వాటికి ఆయింట్‌మెంట్లు రాశాను. అలా జరావాలతో నా రెండో విజిట్ ముగిసింది.
వాళ్లను అలాగే బతకనిద్దాం!
జరావా తెగ ఆటవికులకు ‘పఠాన్ జరావా’ అని ప్రాంతీయంగా పేరు. శారీరకంగా బలిష్టంగా ఉండడం వల్లే వాళ్లను అలా పిలుస్తారు. వారి ప్రాంతాన్ని, మహిళలను ఎంతో బాగా సంరక్షించుకుంటారు. వాళ్లకు జీవన మెలకువలు బాగా తెలుసు. కొత్తగా వేరొకరు నేర్పించవలసిన అవసరం లేదు. ఆ తెగ బయటి ప్రపంచానికి దూరంగా ఉండడం, ఇతరులను అక్కడికి అడుగు పెట్టకనివ్వకపోవడం, కొత్త వ్యక్తుల మీద దాడులు చేయడం లాంటివి వారికి పుట్టుకతో అబ్బిన లక్షణాలు కావు. గతంలో వారికి ఎదురైన చేదు అనుభవాలే వారిని అలా మార్చాయి. గతంలో బ్రిటిష్ వాళ్లు, నావికులు దాడులు చేసి వారిని బానిసలుగా మార్చుకున్న సందర్భాలున్నాయి. బ్రిటిషర్లు వారి నివాసాలపై దాడి చేసి కొందరిని కిడ్నాప్ చేసి నాగరికత నేర్పే ప్రయత్నం చేశారు. అలా బయటి వ్యక్తుల చొరబాట్ల ద్వారా కానీ ఆటవికులకు అప్పటివరకూ తెలియని సిఫిలిస్, మీజిల్స్ లాంటి కొత్త వ్యాధులు సోకాయి. జరావా ఆటవికులకు వ్యాధి నిరోధకశక్తి తక్కువ. కాబట్టి వాళ్లు బయటి ప్రపంచానికి దూరంగా, తమదైన అజ్ఙాత జీవనాన్ని గడపడమే మేలు!’’.
బాణాలకు బలి!
గత నెలలో అమెరికా మిషనరీ 27 ఏళ్ల ‘జాన్ అలెన్ చౌ’, ‘జరావా’ ఆదివాసీ తెగ ప్రజలను చూడాలనే ఆశతో అండమాన్‌లోని నార్త్ సెంటినల్‌లో అడుగు పెట్టాడు. అమెరికా నుంచి అండమాన్ చేరుకున్న అలెన్ మత్స్యకారుల పడవను నార్త్ సెంటినెల్‌కు దూరంగా నిలిపి, చిన్న పడవను స్వయంగా నడుపుకుంటూ దీవిలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే అలెన్‌ను బాణాలతో మట్టుబెట్టారు జరావా ఆదివాసీలు. 2006లో కూడా ఈ దీవికి చేరువలోకి వచ్చిన ఇద్దరు మత్స్యకారులు ఆదివాసీల బాణాలకు బలయ్యారు. దాంతో భారత ప్రభుత్వం అధ్యయనాల కోసం, ఉత్సుకతతో ఇతరులెవరూ చొరబడకుండా, ఈ దీవిలోకి ప్రవేశాన్ని నిషేధించింది. ఈ దీవి చుట్టూరా 3 మైళ్ల వరకూ నో ఎంట్రీ జోన్ ఇప్పటికీ అమల్లో ఉంది. 2011లో ఈ ఆదివాసీల జనాభాను లెక్కించడం కోసం సముద్రతీరానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే అధికారులు మాటు వేయవలసి వచ్చింది.
No comments:
Post a Comment